
- ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల విక్టరీ
- కూటమిగా బరిలోకి దిగిన ఆప్, కాంగ్రెస్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. అక్కడ అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లీ ఘోర పరాభావం ఎదురైంది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఏడు స్థానాలను కైవసం చేసుకున్నది. కాగా, ఈసారి ఇండియా కూటమిలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ, సౌత్ ఢిల్లీలో పోటీ చేసింది. కాంగ్రెస్ చాంద్నిచౌక్, నార్తీస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీలో తమ అభ్యర్థులను బరిలోకి దించింది. వీరంతా బీజేపీ అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు.
కన్హయ్య కుమార్ ఓటమి
నార్తీస్ట్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కన్హయ్య కుమార్‌ను బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారి ఓడించారు. ఇక న్యూఢిల్లీ నుంచి పోటీ చేసిన ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతిని బీజేపీ క్యాండిడేట్ బన్సూరి స్వరాజ్ ఓడించారు. చాంద్ని చౌక్ నుంచి కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన జైప్రకాశ్ అగర్వాల్‌పై బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖందేల్వాల్ గెలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేజ్రీవాల్, కాంగ్రెస్ తరఫున రాహుల్, ప్రియాంక గాంధీ కలిసి ప్రచారం చేసినా ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ అటు ఆప్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరవలేవు. ఈస్ట్ ఢిల్లీ నుంచి బీజేపీ అభ్యర్థి హర్ష్ మల్హోత్ర, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్, నార్త్‌వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేందర్ చందడోలియా, వెస్ట్ ఢిల్లీ నుంచి కమల్జీత్ షెరావత్, సౌత్ ఢిల్లీ నుంచి రామ్‌వీర్ సింగ్ బిధూరి విజయం సాధించారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమైనయ్..
ఢిల్లీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజం అయ్యాయి. బీజేపీనే మళ్లీ 6 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని ఇండియా టుడే యాక్సిస్‌తో పాటు అన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి. చాంద్నిచౌక్లో మాత్రం కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన జైప్రకాశ్ అగర్వాల్, బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ ఖందేల్వాల్ మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని తెలిపాయి. చాంద్నిచౌక్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బీజేపీనే గెలుస్తుందని చెప్పాయి. చివరికి చాంద్నిచౌక్తో పాటు మిగిలిన ఆరు స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్నది.
పని చేయని సానుభూతి
ఆప్, కాంగ్రెస్ కలిసి ఢిల్లీలో ప్రచారం చేశాయి. కేజ్రీవాల్‌ను అకారణంగా అరెస్ట్ చేసి జైలుకు పంపారంటూ ఇరు పార్టీల నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. మోదీ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని, ఈడీ, సీబీఐతో ఫేక్ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నా రని విమర్శించారు. ఎన్నికల టైమ్‌లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ ప్రజల్లో సానుభూతి పొందేందుకు ట్రై చేశారు.
చివరికి సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటున్నదని ఆప్, కాంగ్రెస్ విమర్శించాయి. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్.. న్యాయ్ గ్యారంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందు కు ప్రయత్నించినా ఆదరణ దక్కలేదు. ఇక, బీజేపీ మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ను ప్రజలకు వివరించింది.
కూటమి అభ్యర్థులను గెలిపించినా లాభం లేదని, అవినీతికి పాల్పడిన కేజ్రీవాల్ జైలుకెళ్లడం ఖాయమని బీజేపీ లీడర్లు ప్రచారం చేశారు. వరుసగా మూడోసారి ఢిల్లీ లోక్‌సభ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది.